దుబాయ్, ఆంధ్రప్రభ : మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గ్రూప్-ఏలో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో థాయ్‌లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. తొలి మ్యాచ్‌లోనే భారీ విజయంతో టోర్నీని ప్రారంభించాలని భావిస్తోంది. భారత జట్టులో ప్రతీకా రావల్‌కు టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మంధాన బరిలోకి దిగనుండగా, ప్రతీకా రావల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, భారతి ఫుల్మాలి, వికెట్ కీపర్ రిచా ఘోష్ బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌తో తన 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి నిలిచింది. భారత తుది జట్టులో దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందని శర్మలు చోటు దక్కించుకున్నారు. కమలిని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. తొలి మ్యాచ్‌లోనే సమష్టిగా రాణించి ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు థాయ్‌లాండ్ జట్టుకు కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ నరుఎమోల్ చైవై గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఆమె స్థానంలో నట్థకన్ చంథమ్ జట్టులోకి వచ్చింది. తిపచా పుట్టవాంగ్ జట్టుకు నాయకత్వం వహిస్తోంది. గ్రూప్-ఏలో భారత్, థాయ్‌లాండ్‌తో పాటు హాంకాంగ్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్ నుంచే విజయపథంలో దూసుకెళ్లి ఆసియా కప్‌పై పట్టుబిగించాలని భారత జట్టు భావిస్తుండగా, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న థాయ్‌లాండ్ భారత్‌కు ఎలాంటి సవాల్ విసురుతుందన్నది ఆసక్తికరం