హైకోర్టు తీర్పుతో మారిన సమీకరణాలు.. పార్టీ ఫిరాయింపుల అంశంపై మళ్లీ వేడెక్కిన రాజకీయం కడియం శ్రీహరి సహా పలువురు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న బీఆర్ఎస్ న్యాయపోరాటం హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో.. ఇప్పుడు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. దానం కేసులో వచ్చిన తీర్పు నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై కూడా చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో దానం నాగేందర్ కేసు ప్రత్యేకంగా మారింది. కారణం.. ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం. ఈ అంశంపై కోర్టు కీలకంగా పరిగణించినట్లు తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేల వలస.. ఇప్పుడు అందరి చూపు వారిపైనే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల సంఖ్య పదిగా ఉంది. వీరిలో దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పు వెలువడగా.. మిగిలిన ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్‌పై చర్చ కొనసాగుతోంది. కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి – బాన్సువాడ తెల్లం వెంకట్రావు – భద్రాచలం అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి ప్రకాశ్ గౌడ్ – రాజేంద్రనగర్ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి – గద్వాల కాలె యాదయ్య – చేవెళ్ల డాక్టర్ సంజయ్‌కుమార్ – జగిత్యాల గూడెం మహిపాల్‌రెడ్డి – పటాన్‌చెరు వీరిపై గతంలోనే పార్టీ ఫిరాయింపుల అంశంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దానం నాగేందర్ వ్యవహారంలో ప్రధానంగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కీలక అంశంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరో పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం వల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో ఆయనపై పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. తాము అధికారికంగా పార్టీ మారలేదని, కేవలం ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నామని కొందరు ఎమ్మెల్యేలు గతంలో స్పష్టం చేశారు. ఈ అంశాలపై స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ న్యాయపోరాటం కొనసాగుతోంది. దానం నాగేందర్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌లో చేరడం, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొనడం వంటి అంశాలను బీఆర్‌ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కార్యక్రమం జరిగినట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అనంతరం వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ పరిణామాలను ఆధారాలుగా చూపిస్తూ బీఆర్‌ఎస్ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విషయంలో మాత్రం రాజకీయ పరిస్థితి