కరాటే మాస్టర్ అట్టెం మధునయ్యకు ఘన సన్మానం చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు క్రీడా జ్యోతిని వెలిగించి పట్టణంలో రెండు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం గురుకృప స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ కరాటే మాస్టర్ అట్టెం మధునయ్యను ఘనంగా సన్మానించారు. రామయ్య సర్ నేతృత్వంలో క్రీడాకారులను కూడా సత్కరించారు. ఎంతో మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ అందిస్తూ చెన్నూరు పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కరాటే మాస్టర్ మధునయ్య ఇటీవల వరల్డ్ గిన్నిస్ రికార్డు కార్యక్రమంలో పాల్గొని రికార్డు సాధించడం యువతకు ఆదర్శమని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు కరెంగుల రామయ్య అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఫణిధర్, చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, గురుకృప స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కేవీఎం ప్రకాష్, పీడీ డాక్టర్ మల్లేష్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల రామస్వామి, సభ్యులు, ఫిట్‌నెస్, స్పిరిట్ టీమ్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు