Kaizer News

ఉజ్బెకిస్తాన్‌కు బ‌య‌ల్దేరిన ప్ర‌ధాని

ఉజ్బెకిస్తాన్‌కు బ‌య‌ల్దేరిన ప్ర‌ధాని

· National - India · prabhanews.com

ఉజ్బెకిస్తాన్‌తో వ్యూహాత్మక బంధానికి కొత్త ఊపు! వాణిజ్యం నుంచి రక్షణ వరకు కీలక చర్చలు.. మీర్జియోయెవ్‌తో మోదీ భేటీ శాస్త్రి స్మారకం, గాంధీ కేంద్రం సందర్శన.. అనంతరం కిర్గిజ్‌స్తాన్‌లో ఎస్‌సీవో సదస్సు న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మధ్య ఆసియాతో భారత సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనకు శనివారం బయలుదేరారు. ఈ పర్యటనలో తొలుత ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో రెండు రోజుల పర్యటన చేపట్టనున్న మోదీ, ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మీర్జియోయెవ్‌తో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో జరిగే ఈ పర్యటన మోదీకి ఉజ్బెకిస్తాన్‌కు నాలుగో పర్యటన కావడం విశేషం. భారత్–ఉజ్బెకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. మోదీ, మీర్జియోయెవ్ నేతృత్వంలో ప్రతినిధి బృందాల స్థాయి చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానం, ఇంధనం, విద్య, సాంకేతిక రంగం, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు సమీక్షించనున్నాయి. భవిష్యత్తు సహకారానికి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించే అవకాశం ఉంది. అభివృద్ధి లక్ష్యాలపైనా ఇరు దేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భారత్ లక్ష్యంగా పెట్టుకున్న వికసిత భారత్–2047, ఉజ్బెకిస్తాన్ అభివృద్ధి ప్రణాళికల మధ్య సహకార అవకాశాలపై చర్చించనున్నారు. తాజా అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో పాటు బహుపాక్షిక వేదికల్లో పరస్పర సహకారంపైనా దృష్టి సారించే అవకాశం ఉంది. చర్చల అనంతరం పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశముందని ఉజ్బెకిస్తాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. తాష్కెంట్ పర్యటనలో భారత చరిత్ర, సాంస్కృతిక బంధాలకు గుర్తుగా ఉన్న లాల్‌బహదూర్ శాస్త్రి స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనలు రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు మరింత ప్రాధాన్యం ఇస్తాయని భావిస్తున్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగిసిన అనంతరం మోదీ కిర్గిజ్‌స్తాన్ రాజధాని బిష్కెక్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే 26వ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, అనుసంధానం, ఆర్థిక అవకాశాలపై భారత దృక్పథాన్ని వివరించనున్నారు. సదస్సు సందర్భంగా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయి. మొత్తంగా ఈ నాలుగు రోజుల పర్యటన ద్వారా మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడంతో పాటు వాణిజ్య, రక్షణ, ఇంధన, డిజిటల్ రంగాల్లో కొత్త అవకాశాలకు బాటలు వేయాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది

Original source: prabhanews.com
Read more on Kaizer News