Kaizer News

Man Kills Lover | గర్భవతి అయిన ప్రియురాలిపై అనుమాన

Man Kills Lover | గర్భవతి అయిన ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన డ్రింక్‌ తాగించి హత్య

· National - India · ntnews.com

ముంబై: గర్భం దాల్చిన ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడటంపై ప్రియుడు అనుమానించాడు. విషం కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగించి కూల్‌గా హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో అతడ్ని అరెస్ట్‌ చేశారు. (Man Kills Lover) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. చెంబూర్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ఆశిష్ మగర్, తన ప్రియురాలైన 19 ఏళ్ల విష్ణుమాయ, ఆమె బంధువైన మహిళతో కలిసి వారి ఇంట్లో నివసిస్తున్నాడు. రెండున్నర నెలల గర్భవతి అయిన విష్ణుమాయ ఆగస్ట్‌ 25న మరో ఫ్రెండ్‌తో కలిసి ఉండటం ఆశిష్‌ చూశాడు. ఆమెపై అతడు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ జంట మధ్య వాగ్వాదం జరిగింది. అయితే కొద్దిసేపటికే ఆ గొడవ సద్దుమణిగింది. కాగా, ఆ గొడవ తర్వాత ఆశిష్‌ విషం కలిపిన కూల్‌ డ్రింక్‌ను విష్ణుమాయకు ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు విష్ణుమాయ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విషం సేవించడం వల్లే ఆమె మరణించినట్లు రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆ యువతి మరణంపై పోలీసులు దర్యాప్తు చేశారు. మరోవైపు విష్ణమాయ మరణానికి ముందు ప్రియుడు ఆశిష్‌తో గొడవ జరిగినట్లు పోలీసులకు తెలిసింది. అలాగే అతడు ఇచ్చిన కూల్‌ డ్రింక్‌ తాగిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా ఆమె తమకు చెప్పిందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆశిష్‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు బుకాయించేందుకు ప్రయత్నించినప్పటికి ఆధారాల మేరకు నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్‌ చేశారు. ఆశిష్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా ఐదు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించినట్లు పోలీస్‌ అధికారి తెలిపాడు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

Original source: ntnews.com
Read more on Kaizer News