Kaizer News

శారద… ఓ శ్రావణ నీరదా!

శారద… ఓ శ్రావణ నీరదా!

· Entertainment · ntnews.com

‘ఊర్వశి’ శారద…! తెలుగు, మలయాళం, తమిళం, హిందీ… ఇంకా కన్నడ భాషల్లో పరిచయం అక్కరలేని మహానటి. భారతీయ సినీ చరిత్రలో మూడుసార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారం ‘ఊర్వశి’ అందుకున్న నాయిక. ఈ తెలుగు నటిని మలయాళ సినిమా రంగం నెత్తిన పెట్టుకున్నది. మలయాళ సినీరంగంలో శిఖరాగ్రస్థాయిలో ఎదిగిన 70వ దశకంలో శారద తెలుగు సినిమాల్లోనూ తారగా మెరిసింది. కామెడీ ఆర్టిస్ట్‌గా, కథా నాయికగా, సహనటిగా పాత్రోచిత నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ చేతినిండా సినిమాలతో సక్సెస్‌ఫుల్‌గా నట ప్రస్థానాన్ని కొనసాగించింది. తెలుగు సినిమాల్లో నాయికల పేర్లతో వచ్చిన చిత్రాలు, ఆ నాయికల పేర్లతో వచ్చిన గీతాలు మనకు తెలుసు. ‘జయసుధ’, ‘సుజాత’ వంటివి ఆ కోవలోనివే. 1973లో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శారద’. చిత్రంలోని నాయిక శారద, ఇందులోని పాత్ర పేరు కూడా ‘శారద’ కావడం విశేషం. ఈ చిత్రాన్ని నిర్మించింది పి. రాఘవరావు. సినిమాలో నాయిక పాత్రను మిక్కిలి కరుణ రసాత్మకమైన పాత్రగా మలిచారు విశ్వనాథ్‌. ఈ చిత్రం ఆర్థికంగానూ, ప్రజాదరణ విషయంలోనూ ముందువరుసలో నిలిచింది. చిత్ర కథానాయకుడు అందాల నటుడు శోభన్‌ బాబు. ఈ చిత్రం కోసం డా.సి.నారాయణ రెడ్డి రెండు అందమైన గీతాలను కూర్చారు. ఒక గీతం నాయిక అందాన్ని వర్ణిస్తూ పాడే సందర్భంలోనిది, కాగా మరొకటి నాయికా నాయకుల యుగళగీతం. ఈ గీతం గురించి చెబుతూ “… పల్లవి ఎత్తుకోవడమే ‘శారద’ తో ఉండాలన్నారు దర్శకులు. ట్యూన్‌ వింటేనే తెలిసి పోయింది. చక్రవర్తి ‘తాననా’ అని ప్రారంభించేసరికి ‘శారదా’ అని చప్పున స్ఫురించింది” అంటారు కవి సినారె. అలా రూపొందిందే ఈ కింది పల్లవి.. శారద! నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా ఓ శ్రావణ నీరదా! శారదా!” నాయకుడు తన కలల నాయిక శారదను సంబోధిస్తూ తనను చేరగా వచ్చేందుకు సిగ్గు ఎందుకని అడగగా, ఆమె బుగ్గలు ఎరుపెక్కాయట. ఆమె లేత బుగ్గల సిగ్గును, ఆ బుగ్గల మీద పరుచుకున్న ఎరుపు జిలుగును చెబుతూ ఏకంగా ఆమెను వర్షించే శ్రావణ మేఘం అంటారు. నిజానికి కథా సందర్భంలోనూ వర్షించే మేఘం లాంటి పాత్ర నాయికదని, అందుకే ఆమెను ఇలా సంబోధించానని అంటారు సినారె. నిజానికి చదవడం కంటే కూడా ఈ గీతాన్ని వింటున్నప్పుడు సంగీత దర్శకుడు అవలంభించిన వినూత్న శైలి, గాయకుడు రామకృష్ణ గాత్రంలోని మాధుర్యం మనకు తెలుస్తాయి. ఇక చరణాలకు కాస్తంత వేగంగా రాయమని దర్శకులు సూచించగా కవి సినారె అలాగే రాశారు. ఏమి రూపమది ఇంద్ర చాపమది ఏమి కోపమది చంద్ర తాపమది ఏమి ఆ హొయలూ.. ఏమి కులుకు సెలయేటి పిలుపు అది ఏమి అడుగు కలహంస నడుగు హోయ్‌.. ఏమి ఆ లయలు కలగా కదిలే ఆ అందం కావాలన్నది నా హృదయం ఓ శ్రావణ నీరదా! శారదా! ఈ చరణం గురించి చెబుతూ తాను ఎంత వేగంగా రాశారో అంతే తమాషాగా చక్రవర్తి దీనిని స్వరపరిచారని అంటారు సినారె. వర్ణన కూడా ఎంత బాగుందో కదా… సాధారణంగా కోపాన్ని ఎరుపుతో… సూర్యుని వేడితోనో… ఇంకా మరోలానో వర్ణిస్తాం. అయితే ఇక్కడ చూడండి… ఆమె రూపం ఇంద్రధనుస్సు అట. అంటే అందాల హరివిల్లు అన్నమాట. మరి ఆమె కోపం ఎటువంటిదట అంటే… చంద్ర తాపమట. అంటే చల్లని వెన్నెల అన్నట్టు. వింటున్నంత సేపు ఈ చరణాలు ఎంతో హాయిని గొలపడమేకాక ఉరకలె

Original source: ntnews.com
Read more on Kaizer News