ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘మహారాజా 2’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు నిథిలన్ ఇటీవల సినిమా కథను తనకు వివరించారని, అది ఎంతో అద్భుతంగా అనిపించిందని ఆయన తెలిపారు. నిథిలన్ అద్భుతమైన దర్శకుడంటూ ప్రశంసలు కురిపించారు.‘మహారాజా’ సినిమా విడుదలకు ముందు కొంతమంది ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం పెట్టుకోలేదని, అయితే తాను మాత్రం సినిమాపై మొదటి నుంచీ విశ్వాసంతో ఉన్నానని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. ఇక ‘మహారాజా’ను హాలీవుడ్‌కు అమ్మినట్లు నిర్మాత తనకు ఫోన్ చేసి చెప్పారని విజయ్ వెల్లడించారు. ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారని తాను అడగగా, హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్‌కోనహే నటించనున్నట్లు నిర్మాత చెప్పారన్నారు. దీంతో సరదాగా స్పందిస్తూ.. సినిమాలో తనకు కూడా ఓ పాత్ర ఇస్తే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించడానికి సిద్ధమని చెప్పినట్లు వెల్లడించారు. తనకు హాలీవుడ్‌లో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని విజయ్ సేతుపతి తెలిపారు. తన సినిమా హాలీవుడ్‌కు వెళ్లడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలతో ‘మహారాజా 2’పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. కాగా మహారాజా సినిమా హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ సినిమాలో మాథ్యూ మెక్‌కోనహే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు విజయ్ చేసిన వ్యాఖ్యలతో ప్రచారానికి తెర పడింది