Shorts Medipally: ప్రజా భద్రత, నేరాల నియంత్రణపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాధారణ రోజులతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా చేపట్టిన గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నారపల్లిలోని దివ్యనగర్ కమ్యూనిటీ హాల్‌లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా ఉపాధ్యాయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు దూరంగా ఉండి, వెలుతురు, జనసంచారం ఉన్న మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పాటు అవసరమైనప్పుడు లైవ్ లొకేషన్ షేర్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వెంటాడటం, వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహ హింస వంటి ఘటనలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైనప్పుడు షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పిల్లలు, యువతకు మంచి స్పర్శ–చెడు స్పర్శపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని తెలిపారు. అసౌకర్యంగా అనిపించే సంఘటనలను దాచుకోకుండా తల్లిదండ్రులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు అధికంగా గుమిగూడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐలు నర్సింగ్ రావు, ఉదయ్, రవి, తిరుపతి, ఘట్‌కేసర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, షీ టీమ్ సిబ్బంది, స్థానిక సహచారిణులు సుల్తానా, రాధ, వాణి, తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మంది కాలనీ నివాసులు కార్యక్రమానికి హాజరయ్యారు