Kaizer News

LB Nagar: ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ డ్రైవింగ్‌కు దూ

LB Nagar: ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్!

· City - Hyderabad · hmtvlive.com

Shorts ఎల్‌బీనగర్‌: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అష్టలక్ష్మి టెంపుల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన సీపీ.. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారులపై అనవసర రద్దీకి కారణం కాకుండా పోలీసులకు సహకరించాలని, వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని కోరారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సీపీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రూట్ డైవర్షన్లను వాహనదారులు పాటించాలని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాద నివారణ చర్యలు, భక్తుల రాకపోకలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్ డీసీపీ బి.అనురాధ, ఐపీఎస్, ఎస్‌ఓటీ డీసీపీ మనోహర్, ఎస్‌బీ డీసీపీ నర్సింహారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ జోన్ ఏసీపీ రవీందర్‌రెడ్డి, చైతన్యపురి SHO కె.సైదులు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆకట్టుకుంది. ప్రజల సహకారంతోనే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించగలమని పోలీస్ అధికారులు తెలిపారు. భక్తి, ఆనందంతో పాటు భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News