Nepal Floods : నేపాల్ (Nepal) లో సంభవించిన ఆకస్మిక వరదల్లో (Flash Floods) వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలల్లో గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగుతున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఒక అద్భుతం జరిగింది. ఈ విపత్తు జరిగిన మూడు రోజుల తర్వాత రసూవా జిల్లా (Rasuva district) లో శిథిలాల కింద బురదలో ఉన్న ఆరేళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది బయటికి తీశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భోటేకోశి నదికి వచ్చిన వరదలవల్ల గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం శుక్రవారం గాలిస్తుండగా.. శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన బృందాలు, బాలికను సురక్షితంగా బయటకు తీశాయి. రక్షించిన బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు శనివారం ఖాట్మండుకు తరలించారు. కాగా బుధవారం హిమానీనదం (గ్లేసియర్) కూలిపోవడంతో ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. దాంతో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి