Kaizer News

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

· Technology · prabhanews.com

పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్‌ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్.. లేబర్ శాఖకు బదిలీ చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: జీవో 97పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటెక్నిక్ విద్య వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉన్న జీవో 97ను ప్రభుత్వం పునఃసమీక్షించి రద్దు చేయాలని ఆయన కోరారు. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ పరిధిలోనే కొనసాగించడం విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యను లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ పరిధిలోకి తీసుకురావద్దని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు తాము లేబర్ శాఖ పరిధిలోకి వెళ్తామేమోనన్న అపోహలకు గురవుతున్నారని తెలిపారు. ఈ గందరగోళానికి ప్రభుత్వం వెంటనే తెరదించాలని సూచించారు. పాలిటెక్నిక్ విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి విద్యార్థులకు త్వరగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ఆలోచన మంచిదేనని ఆయన అన్నారు. అయితే, దాని కోసం పాలిటెక్నిక్ విద్యా స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న విద్యార్థుల ఆకాంక్ష సహజమైనదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యా విధానం ఎలా కొనసాగుతోందో, తెలంగాణలోనూ అదే తరహా విధానాన్ని అమలు చేస్తే విద్యార్థులకు స్పష్టత ఉంటుందని కడియం శ్రీహరి సూచించారు. విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం జీవో 97పై మరోసారి సమగ్రంగా ఆలోచించాలని కోరారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా తన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News