పూజ తర్వాత మొక్కగా మారే వినాయకుడు.. పర్యావరణ పరిరక్షణకు వినూత్న అడుగు సీడ్ గణేశా ప్రతిమలను ఆవిష్కరించిన చిరంజీవి, సంతోష్‌కుమార్ హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సీడ్ గణేశుడిని పూజించి ఆ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేయడం వల్ల.. వినాయకుడు మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తాడని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఒక యజ్ఞంలా భావించి ఇప్పటికే 20 కోట్ల మొక్కలు నాటేలా లక్షల మందిని ప్రోత్సహించిన సంతోష్‌కుమార్ అభినందనీయుడని అన్నారు. పచ్చదనం పెంపు కోసం ఆయన చేస్తున్న కృషికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ప్రశంసించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పకృతిని కాపాడే బాధ్యత సీడ్ గణేశుడిని ఆరాధించడం ద్వారా అటు పుణ్యం, ఇటు పురుషార్థం అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత దక్కుతుందని చిరంజీవి చెప్పారు. వినాయక చవితి వచ్చిందంటే ఊరూవాడా వేడుకలే వేడుకలని, అయితే ఇటీవల పోటీ పెరిగిపోవడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని అన్నారు. పండుగతో అందరికీ ఆరోగ్యం అందాలని, భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే సోదర సమానుడైన సంతోష్‌కుమార్ సీడ్ గణేశాను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను దీక్షలా ముందుకు తీసుకెళ్తున్న సంతోష్‌కుమార్.. వినాయకుడి పూజకు విత్తనంతో కలిసి ఉన్న ప్రతిమను అందిస్తున్నారని చెప్పారు. పూజ ముగిసిన తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేస్తే దేవుడే మొక్కగా మారి ఆశీర్వదిస్తాడని అన్నారు. సీడ్ మొక్కగా మారడంతో మనం అటు వినాయకుడిని పూజించినట్లవుతుందని, ఇటు మొక్కలను నాటే బాధ్యతను పూర్తి చేసినట్లవుతుందని వివరించారు. హరితహారం స్పూర్తితో.. కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మొక్కలు నాటడం అనేది కేవలం ఒక ఎంపిక కాదని, అదొక అవసరమని జోగినిపల్లి సంతోష్‌కుమార్ బలంగా నమ్ముతున్నారని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొనే హరితహారం స్ఫూర్తితో 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మూడు మొక్కలు నాటాలి, వాటిని మూడేళ్లు పెంచాలి, మరో ముగ్గురిని నామినేట్ చేయాలి అనే విధానంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ ద్వారా ఏకంగా 19.6 కోట్ల చెట్లను నాటడం విశేషం. పండుగను కేవలం ఒక వేడుకగా కాకుండా ఒక అర్థవంతమైన పర్యావరణ ఉద్యమంగా మార్చే ఈ సీడ్ గణేశాను పౌరులు, గృహ సముదాయాలు, ఆలయ కమిటీలు దత్తత తీసుకోవాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ్ఞప్తి చేస్తోంది. ఈసారి ప్రతి ఇంట్లో పర్యావరణహిత గణేశుడిని