Kaizer News

డెలివరీ బాయ్‌పై ట్రాఫిక్‌ పోలీసుల దౌర్జన్యం

డెలివరీ బాయ్‌పై ట్రాఫిక్‌ పోలీసుల దౌర్జన్యం

· City - Hyderabad · ntnews.com

నో పార్కింగ్‌ జోన్‌లో నిలిపిన బైక్‌ సీజ్‌ ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): వాహనదారులపై విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహరించే తీరు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఓవైపు రోడ్డుపై ప్రమాదాలు నిలువరించలేని యంత్రాంగం.. సామాన్యుడి వాహనాలను జప్తు చేసే క్రమంలో వ్యవహరించే తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్‌ బైక్‌ను జప్తు చేసి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహరించిన తీరుతో నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోటార్‌ వాహనాల చట్టం, ట్రాఫిక్‌ నిబంధనలు అమలు పేరిట బాధ్యతయుతంగా పనిచేస్తున్నామని చెప్పుకునే పోలీసులు… ఇలాంటి ఘటన సందర్భంలో మానవత్వాన్ని మరిచిపోతున్నారు. అయినా ఎంతో కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నా… ఎందుకు రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు తొలగడం లేదనీ, రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదని నెటిజన్ల సవాలక్ష ప్రశ్నలు గుప్పిస్తున్నారు. నిబంధనలు పాటించనీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కానీ, ఆ నిబంధనలను అమలు చేసే విషయంలో కొంత మానవత్వాన్ని చూపించాలంటున్నారు. ఓ డెలివరీ సంస్థకు చెందిన డెలివరీ బాయ్‌ ఆర్డర్‌ తీసుకునేందుకు రోడ్డు పక్కన బైక్‌ ఆపి, వెళ్లి వచ్చేలోగా ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేసి, ట్రాలీ వెహికిల్‌లోకి ఎక్కించారు. అయితే ఇక్కడే అధికారులు డెలివరీ బాయ్‌ విషయంలో కొంత దురుసుగా, కఠినంగా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జప్తు చేసిన వాహనాన్ని తీసుకెళ్లే క్రమంలో నిబంధనల అమలు చేసేలా అవగాహన కల్పించాలి గానీ, నేరుగా జప్తు చేయడం వల్ల ప్రజల్లో అవగాహన ఎప్పుడు వస్తుందనీ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయమే వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్‌ నిబంధనలు తెలియకపోతే… తోటి వాహనదారులకు కలిగి ఇబ్బందులపై అవగాహన ఉండక్కర్లేదా? అని ప్రశ్నిస్తుంటే.. మరికొంత మంది ఇలాంటి చిన్న, చితకా, సామాన్య ప్రజలపై పోలీసు చర్యలతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసిన ఈ అంశంపై ఇప్పటివరకు సిటీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ డెలివరీ బాయ్‌పై వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పుడు అధికారుల పనితీరును, పర్యవేక్షణను ప్రశ్నిస్తోంది

Original source: ntnews.com
Read more on Kaizer News