Nepal Floods: నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. వరదల్లో కొట్టుకొచ్చిన ఓ బ్యాంకు లాకర్‌ను కొందరు స్థానికులు పగలగొట్టి అందులోని నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ధాడింగ్ జిల్లా పోలీసుల వివరాల ప్రకారం.. రసువా జిల్లాలోని భోటే కోశి ప్రాంతంలో వచ్చిన వరదల్లో ఓ బ్యాంకు లాకర్ కొట్టుకువచ్చింది. అది ధాడింగ్ జిల్లాలోని నది తీరంలో స్థానికుల కంటపడింది. లాకర్‌ను గుర్తించిన కొందరు వ్యక్తులు దాన్ని తమ ఇళ్లకు తీసుకెళ్లి పగలగొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నగదు తీసుకెళ్లిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు మొత్తం 29 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి భారత కరెన్సీలో సుమారు రూ.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది