మత్స్యశాఖ కమిషనరేట్‌లో టెండర్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు – చిన్న ఉద్యోగులకు ఒక న్యాయం.. పెద్ద అధికారులకు మరో న్యాయమా అంటూ ప్రశ్న హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మత్స్యశాఖకు సంబంధించిన టెండర్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఒక శాఖాధిపతిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకర విషయమని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. వార్తా కథనంలో వెల్లడైన అంశాలు నిజమైతే, టెండర్ల ప్రక్రియలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగి ఉండవచ్చని ఆరోపించారు. దీనిపై తెలంగాణ ఏసీబీ తక్షణమే చర్యలు ప్రారంభించాలని కోరారు. జర్నలిస్టు నుంచి కాంట్రాక్టర్ వరకు విచారణ జరపాలి వార్తా కథనం రాసిన జర్నలిస్టు వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు, మత్స్యశాఖ కమిషనరేట్‌లో సోదాలు నిర్వహించి సంబంధిత దస్త్రాలను స్వాధీనం చేసుకోవాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆరోపణలకు సంబంధించిన కాంట్రాక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత చెల్లింపులను నిలిపివేయాలని సూచించారు. ఆ ఫైలును పరిశీలించిన ప్రతి అధికారి నుంచి వివరణ తీసుకోవాలని, ఒప్పంద రేట్లలో అసాధారణ పెంపు జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆరోపణలను నిర్ధారించే లేదా ఖండించే ఆధారాలను సేకరించాలని అన్నారు. విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలితే అవినీతి నిరోధక చట్టం కింద వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. చిన్న స్థాయి ఉద్యోగుల విషయంలో ఒక విధంగా, ఉన్నతాధికారుల విషయంలో మరో విధంగా వ్యవహరించడం సరికాదని ప్రశ్నించారు. ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మత్స్యశాఖ మంత్రిపై కూడా ప్రశ్నలు తలెత్తే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు