Shorts హైదరాబాద్: జపాన్‌లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం–TOMCOM) కీలక ముందడుగు వేసింది. జపాన్‌కు చెందిన POGLI Co. Ltdతో టాంకాం శుక్రవారం సచివాలయంలో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. టాంకాం ఎండీ కాంతి వెస్లీ, POGLI వ్యవస్థాపకులు, CEO డా. కరుణ్ మల్హోత్రా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా జపాన్‌లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, సంబంధాలను ఏర్పరచుకోవడం POGLI బాధ్యతగా వ్యవహరించనుంది. అభ్యర్థుల ఎంపిక, రిజిస్ట్రేషన్, ప్రాథమిక స్క్రీనింగ్, డాక్యుమెంటేషన్, జపనీస్ భాషా శిక్షణ, ప్రీ-డిపార్చర్ శిక్షణను టాంకాం చేపట్టనుంది. జపాన్‌లో ఉద్యోగాలకు అవసరమైన ట్రేడ్ నైపుణ్యాలతో పాటు జపనీస్ భాష, అక్కడి పని సంస్కృతి, జీవన విధానంపై యువతకు అవగాహన కల్పించేలా రెండు సంస్థలు కలిసి శిక్షణ విధానాన్ని రూపొందించనున్నాయి. తొలుత జపాన్‌లోని కన్సాయ్ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించి, అనంతరం ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. తొలి ఏడాదిలో 400 నుంచి 500 మంది తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జపాన్‌లో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న తెలంగాణ యువతకు టాంకాం జపనీస్ భాషలో శిక్షణ అందిస్తోంది. విదేశాల్లో తెలంగాణ యువతకు సురక్షితమైన, పారదర్శకమైన, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా టాంకాం చర్యలు కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు