ఆపరేషన్ మిడ్‌నైట్ గోల్డ్‌స్ట్రైక్’లో రూ.10.75 కోట్ల బంగారం స్వాధీనం.. ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి సహా ఆరుగురు అరెస్ట్ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. ‘ఆపరేషన్ మిడ్‌నైట్ గోల్డ్‌స్ట్రైక్’ పేరుతో నిర్వహించిన మెరుపు దాడుల్లో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగితో పాటు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఐదుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో రూ.10.75 కోట్ల విలువైన 6.85 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు బంగారాన్ని మైనపు ముద్దలలో దాచి 16 క్యాప్సూల్స్ రూపంలో తరలిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. దుబాయ్, బ్యాంకాక్, మాలే మార్గాల ద్వారా ప్రయాణికుల సహాయంతో బంగారాన్ని భారత్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక మరికొందరు ఉన్నారనే అనుమానంతో డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తును మరింత విస్తరించారు