హైదరాబాద్‌లో 3.5 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను గజం రూ.2 లక్షలుంటే.. రూ. 56 వేలకే ప్రైవేటుకు ధారాదత్తం ఆ స్థలంపై సుప్రీంకోర్టులో ఓడిన వ్యక్తి సంస్థకు రూ. 87 కోట్లకే అప్పగింత 15,445 గజాల స్థలాన్ని ఫ్రీహోల్డ్ చేసి దయారాం మిల్స్‌కు కట్టబెట్టిన వైనం కీలక నేతల అండతో పరిశ్రమల శాఖలో చకచకా కదిలిన ఫైళ్లు ఏకపక్ష జీవో జారీ చేసిన టీజీఐఐసీ.. ఖాళీ చేయాలని ఆయిల్‌ఫెడ్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థకు చెందిన రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని కారుచౌకగా అమ్మేందుకు ప్రభుత్వమే సిద్ధపడటం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన స్థలంపై హక్కు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఓడిపోయిన పాత లీజుదారుడికి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. వందల కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 87 కోట్లకే ప్రైవేట్‌పరం చేస్తూ పరిశ్రమల శాఖ తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. దీనివెనుక పలుకుబడిగల పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు పెద్దల ‘కృప’! హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆర్టీసీ బస్ భవన్ ఎదురుగా ఉన్న ఆజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియా ప్లాట్ నం.1లో 17,261 చదరపు గజాల (సుమారు 3.5 ఎకరాలకుపైగా) స్థలం ఉంది. నిజాం కాలంలో ఈ స్థలాన్ని దయారాం సూరజ్‌మల్ లహోటీ ఆయిల్ మిల్స్‌కు లీజుపై కేటాయించారు. కానీ నిబంధనల ఉల్లంఘన కారణంగా 1961లోనే ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసి భూమిని స్వాదీనం చేసుకుంది. కానీ ఈ స్థలంపై హక్కు కోసం ఆ సంస్థ సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, ఆ సంస్థకు కేవలం 1,277 గజాల స్థలంపైనే హక్కు ఉందని.. మిగిలిన ప్రధాన భూభాగమంతా ప్రభుత్వానిదేనని సుప్రీం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల క్రితం 1991లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించగా ఈ స్థలంలో విజయ ఆయిల్స్ గోడౌన్లు, సేల్స్ ఆఫీసు, ఇతర కార్యకలాపాలను ఆయిల్‌ఫెడ్ నిర్వహిస్తోంది. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా.. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మెట్రో మార్గం పరిధిలోని మెయిన్ రోడ్డుపై గజం బహిరంగ మార్కెట్ విలువ రూ.2 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన 15,445 చదరపు గజాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 309 కోట్ల దాకా పలుకుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం 2023 నాటి పాత రిజిస్ట్రేషన్ బేసిక్ రేటును పరిగణనలోకి తీసుకొని గజానికి కేవలం రూ. 56,617 చొప్పున నిర్ణయించింది. మొత్తం స్థలాన్ని రూ. 87.44 కోట్లకే ప్రైవేట్ సంస్థకు ‘ఫ్రీహోల్డ్’ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ, పరిశ్రమల శాఖల అధికారులు రాకెట్ వేగంతో ఫైళ్లను కదిలించారు. పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆయిల్‌ఫెడ్‌ను పర్యవేక్షించే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు కూడా తెలియకపోవడం గమనార్హం. మే 22 నుంచి జూన్ 12లోగా ఈ భూమిని ధారాదత్తం చేయడం కూడా జరిగిపోయింది. మే 22న ప్లాట్ నం.1లోని 15,445 గజాల భూమిని ఫ్రీహోల్డ్ చేసి దయారాం సంస్థకు అప్పగించాలని పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ. 87.44 కోట్లు చెల్లించాలని మే 26న ఆ సంస్థకు డిమాండ్ నోటీసు పంపింది. దీంతో ఆ ప్రైవేట్ సంస్థ వెంటనే 10 శాతం కింద రూ.8.74 కోట్