దివ్యాంగుల గళం అసెంబ్లీలో వినిపిస్తాం! రూ.6 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారు? దివ్యాంగులకు పైసలు లేవా? దివ్యాంగులపై దయ లేని ప్రభుత్వమా? ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి! బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత ఎల్బీనగర్, ఆంధ్రప్రభ: దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, ఉపాధి అవకాశాల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు తెలిపారు. ఎల్బీనగర్‌లో నిర్వహించిన దివ్యాంగుల “సమర శంఖారావం” సభలో పాల్గొన్న ఆయన.. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, వారి న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, సమాజంలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వారికి భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు అన్నారు. వారి గళం శాసనసభలోనూ బలంగా వినిపించేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు. పింఛన్ పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగుల పింఛన్‌ను గణనీయంగా పెంచడంతో పాటు, గృహ పథకాల్లో 5 శాతం, విద్యా, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించామని హరీశ్ రావు గుర్తు చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం అమలులో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను ప్రస్తావిస్తూ తెలంగాణలోనూ దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.6 వేల పింఛన్‌ను వెంటనే అమలు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పింఛన్ బకాయిలను చెల్లించాలని కోరారు. దివ్యాంగుల కోసం ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, విధాన నిర్ణయాల్లో వారికీ భాగస్వామ్యం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. త్వరలో ఇందిరాపార్క్ వద్ద దివ్యాంగుల తరఫున భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దివ్యాంగుల హక్కులు, ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “దివ్యాంగులను బలహీనులుగా చూడొద్దు.. ప్రతి ఒక్కరూ సమాజంలో శక్తివంతమైన భాగస్వాములే. వారి హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని హరీశ్ రావు స్పష్టం చేశారు