చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల ప్రచార శోభాయాత్ర బెంజ్ సర్కిల్ నుంచి లబ్బీపేట వరకు భక్తుల ఆధ్యాత్మిక ప్రదర్శన మంగళవాయిద్యాలు.. భజన కీర్తనలు.. శ్రీరామ హృదయం ప్లకార్డులతో సందడి సనాతన ధర్మ విలువలు, మానవీయతపై ప్రజల్లో చైతన్యానికి పిలుపు 90 రోజులపాటు ఇళ్లలో విష్ణు సహస్రనామ పారాయణానికి భక్తుల సంకల్పం విజయవాడ, ఆంధ్రప్రభ : జై శ్రీమన్నారాయణ నామస్మరణతో విజయవాడ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక చైతన్య శోభాయాత్ర నిర్వహించారు. బెంజ్ సర్కిల్ జంక్షన్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర లబ్బీపేట వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శోభాయాత్రలో గళవాయిద్యాలు, భజన కీర్తనలు, ‘జై శ్రీమన్నారాయణ’ నామస్మరణతో భక్తులు ముందుకు సాగారు. స్వామివారి చిత్రపటాలు, ‘శ్రీరామ హృదయం’ ప్లకార్డులతో నిర్వహించిన ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంది. శోభాయాత్ర సాగిన మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి శతాబ్ది వేడుకల సందేశాన్ని, సనాతన ధర్మ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సమాజంలో మానవీయ విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, స్నేహభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా జూలై 29 నుంచి అక్టోబర్ 26 వరకు 90 రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు భక్తులు తమ ఇళ్లలో శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘శ్రీరామ హృదయం’, సత్సంగ కార్యక్రమాల ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 8న దీపావళి రోజున నిర్వహించనున్న స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో భక్తులందరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మహోత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ముంతా మాధవీభాస్కరరావు, వి. రాఘవన్, పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు