Jubilee Hills | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం ఓ కుటుంబంలో విషాదంగా మారింది. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో కారు పూజ చేయిస్తుండగా జరిగిన ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన మేనల్లుడు సాయికుమార్‌తో కలిసి కొత్త కారు పూజ కోసం ఆలయానికి వెళ్లారు. పూజలో భాగంగా కారును కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలని పూజారి సూచించారు. ఈ సమయంలో సాయికుమార్ పొరపాటున బ్రేక్‌కు బదులుగా ఎక్సలేటర్ తొక్కడంతో కారు ఒక్కసారిగా వేగంగా ముందుకు దూసుకెళ్లింది. కారు ముందు ఉన్న రామచంద్రరావును ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందంలో ఆలయానికి వెళ్లిన కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది