Kaizer News

ఇందిరమ్మ ఇండ్ల జాబితా రహస్యం

ఇందిరమ్మ ఇండ్ల జాబితా రహస్యం

· City - Hyderabad · ntnews.com

గోప్యత పాటిస్తున్న హౌసింగ్‌ బోర్డు తుది జాబితా విడుదల చేయకుండానే లాటరీలు.. తమ పేర్లు రాకపోవడంపై అర్జీదారుల అనుమానాలు అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని ఆరోపణలు ఇందిరమ్మ ఇండ్ల టవర్ల కేటాయింపులో తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నది. దరఖాస్తుల వివరాలు, అర్హుల జాబితా, అనర్హుల సంఖ్యను రహస్యంగా ఉంచుతున్నారు. దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, అనర్హుల ఏరివేత, అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయినా జాబితాను బహిర్గతం చేయకుండా దాస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 16 నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రకటన విడుదలైనప్పటి నుంచి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ దాకా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేశారు. ప్రతి విషయాన్ని ప్రకటన రూపంలో బహిర్గతం చేశారు. అనర్హులను తొలగించాక అర్హుల తుది జాబితాను మాత్రం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హౌసింగ్‌ బోర్డు అధికారులను అడగ్గా పూర్తి వివరాలు తెలియరాలేదంటున్నారు.60 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో 20 వేలకు పైగా అనర్హులున్నట్లు నోటిమాటగా చెప్తున్నారు. అధికారికంగా ఎందుకు ప్రకటించడంలేదని అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. అనర్హుల వివరాలు, తుది జాబితా బయటకు రాకపోవడంతో లాటరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డిదారిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు అనుకూలమైన వాళ్లకు ఇండ్లు కేటాయించేందుకే తుది జాబితాను గోప్యంగా ఉంచుతున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది. సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు అర్హుల తుది జాబితా విడుదల చేయకుండానే అధికారులు లాటరీ ద్వారా ఎంపికలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో లాటరీ పూర్తి చేశారు. మరో ఎనిమిది నియోజకవర్గాల్లో నేడు, రేపు పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో లాటరీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. కూకట్‌పల్లిలో మహిళా కోటా, బీసీ సామాజిక వర్గాలకు ఇండ్లను కేటాయించకపోవడం జాబితాపై అధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అదేవిధంగా బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రాకముందే ఆగమేఘాల మీద లాటరీ తీశారు. ఎమ్మెల్యేకు ఆహ్వానం అందించి ఆయన రాకుండానే లాటరీ తీయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు అంత తొందరగా ముగించాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ రెండు సంఘటనలు దరఖాస్తుదారులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు లాటరీ విధానంలో చేపట్టడం వల్ల కేటాయింపులు పారదర్శకంగా జరుగుతాయనుకుంటే అదే తంతు కొనసాగుతున్నది. ఇప్పటికైనా మిగిలిన నియోజకవర్గాల్లో కేటాయింపులు పారదర్శకంగా చేపట్టాలని దరఖాస్తుదారులు డిమాండ్‌ చేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News