Kaizer News

క్యూఆర్ కోడ్ పనిచేయక ప్రయాణికుల అవస్థలు!

క్యూఆర్ కోడ్ పనిచేయక ప్రయాణికుల అవస్థలు!

· Technology · prabhanews.com

ఆన్‌లైన్ టికెట్లు ఉన్నా గేట్లు తెరుచుకోని పరిస్థితి.. ఎల్‌బీనగర్‌లో మొదలైన ఇబ్బందులు స్టేషన్ల వద్ద భారీ క్యూలు హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు సాంకేతిక సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రవేశ సేవల్లో లోపం తలెత్తడంతో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు కూడా స్టేషన్లలో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌లో ఈ సమస్య ప్రభావం ఎక్కువగా కనిపించింది. ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద ఉన్న స్కానర్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే రద్దీ సమయాల్లో సమస్య తలెత్తడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పటికీ గేట్లు తెరుచుకోలేదు. దీంతో పలువురు ప్రయాణికులు స్టేషన్ సిబ్బంది సహాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా టికెట్లు పొందడంలోనూ కొంత అంతరాయం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ సేవల ద్వారా టికెట్లు పొందేందుకు ప్రయత్నించిన కొందరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్లు సరిగా పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ టికెటింగ్‌పై ఆధారపడిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా ఆటోమేటిక్ ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద రద్దీ పెరిగింది. చివరకు పలువురు ప్రయాణికులు టికెట్ విక్రయ యంత్రాలు, టికెట్ కౌంటర్ల వైపు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అక్కడ కూడా క్యూలు పెరిగాయి. రద్దీ సమయాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో డిజిటల్ టికెటింగ్ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే అందుబాటులో ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఇలాంటి సాంకేతిక అంతరాయాలు పునరావృతం కాకుండా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని డిమాండ్ చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News