హైదరాబాద్: నారాయణగూడలో రాఖీ పండుగ సందర్భంగా ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ బిల్లులో అదనంగా రూ.3 వేల ‘వెయిటింగ్, డెలివరీ ఛార్జీ’ విధించడాన్ని ప్రశ్నించడంతో వివాదం తలెత్తి, చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల ఆశిష్ పోర్వాల్ తన సోదరుడు రాహుల్, సోదరి కీర్తితో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మరో 15-20 మంది కుటుంబ సభ్యులతో కలిసి నారాయణగూడలోని రత్నదీప్‌లో ఉన్న ‘భట్టడ్ కీ ఇడ్లీ’ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భోజనం అనంతరం రూ.5 వేల బిల్లు వచ్చిందని, దానికి అదనంగా రూ.3 వేల ‘వెయిటింగ్, డెలివరీ ఛార్జీ’ విధించారని ఆశిష్ ఆరోపించారు. ఈ ఛార్జీ గురించి ముందుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించడంతో రెస్టారెంట్ యాజమాన్యంతో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. తాను బిల్లు చెల్లించిన అనంతరం సంభాషణను ఫోన్‌లో రికార్డు చేయడం ప్రారంభించగా, యజమాని యోగేశ్ భట్టడ్, సిబ్బంది తనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారని ఆశిష్ ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో యజమాని సోదరుడు రితేష్ భట్టడ్ తన సోదరుడు రాహుల్‌పై దాడి చేయడంతో గాయాలైనట్లు ఆరోపించారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాలుగు నెలల గర్భిణి కీర్తిని సిబ్బంది చేయి పట్టుకుని లాగారని, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తన గొంతు పట్టుకుని సుమారు ఐదు నిమిషాల పాటు ఊపిరాడకుండా చేశారని ఆశిష్ ఆరోపించారు. ముగ్గురు సోదరసోదరీమణులకు గాయాలైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, గాయాలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఆశిష్ ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 115(2), 352, 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెస్టారెంట్‌లో అసలు ఏం జరిగిందన్నది సీసీటీవీ పరిశీలన, విచారణలో తేలాల్సి ఉంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి