Bengaluru | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ మహిళతో పాటు ఇద్దరు బాలికలను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ మృతి చెందారు. మృతులను హిందూపురానికి చెందిన ఇర్ఫానా (46), రుకియా (13), రాకియా (8)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇర్ఫానా, రుకియా, రాకియాలు ఆదివారం బంధువుల ఇంటికి వచ్చారు. సోమవారం తిరిగి తమ స్వస్థలానికి వెళ్లే క్రమంలో దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగింది. అదే సమయంలో వచ్చిన రైలు వీరిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న యలహంక రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు