Kaizer News

నెత్తురోడిన రోడ్లు

నెత్తురోడిన రోడ్లు

· City - Hyderabad · ntnews.com

ఒకేరోజు ఏడుగురు దుర్మరణం శంషాబాద్‌లో నలుగురు.. శామీర్‌పేటలో ముగ్గురు నగర రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఒకే రోజు ఏడుగురు చనిపోయారు. శంషాబాద్‌ సీఐ సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం..శంషాబాద్‌ పట్టణంలోని మధురనగర్‌ కాలనీలో నివాసముంటున్న కేతావత్‌ లింబ్యానాయక్‌(54) భార్య జమున(45) తమ్ముళ్లు కేతావత్‌ మాన్‌సింగ్‌(48), కేతావత్‌ వస్తాన్‌(45)కలిసి వినాయక చవితి పండుగకు స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా, నవాబ్‌పేట మండలం, మెట్టుగూడ తండాకు కారులో వెళ్లారు. శనివారం తిరిగి వస్తుండగా హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి, శంషాబాద్‌ మండలం పాలమాకుల సమీపంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన కల్వర్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్‌ సభావత్‌ అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుకొని పరిశీలించగా కేతావత్‌ లింబ్యానాయక్‌, జమున, కేతావత్‌ మాన్‌సింగ్‌, వస్తాన్‌ మృతి చెందినట్లు వైద్యసిబ్బంది నిర్ధారించారు. తీవ్ర గాయాలకు గురైన డ్రైవర్‌ సభావత్‌ అశోక్‌ను చికిత్స కోసం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. సిటీబ్యూరో/శంషాబాద్‌ రూరల్‌/శామీర్‌పేట, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ) : నాచారం ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్‌ హుస్సెన్‌(26), కూలీలు ఇబ్రహీం, రింకు, అశోక్‌, భీమ్‌షాలతో కలిసి వాహనంలో శుక్రవారం రాత్రి చేగుంట నుంచి కీసర వైపు వస్తున్నారు. శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై వీరు ప్రయాణిస్తున్న వాహనం టైర్‌ పంచర్‌ అయ్యింది. దీంతో ఇస్మాయిల్‌ హుస్సేన్‌, రింకు, ఇబ్రహీంలతో కలిసి తమ టైర్‌ను మారుస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో వాహనం ఇస్మాయిల్‌ హుస్సేన్‌, రింకు, ఇబ్రహీంలను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అశోక్‌, భీమ్‌ షాలు రాళ్లు తేవడానికి వెళ్లడంతో ప్రమాదం బారి నుంచి బయటపడ్డారు. అతివేగంతో నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టిన వాహనం డ్రైవర్‌ నాగరాజును వారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే నాగరాజు అక్కడి నుంచి పరారీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News