Thalakondapally: వర్షాకాలంలో ఏర్పడే విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రామపంచాయతీ సిద్ధంగా ఉందని సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్, నూకం కోటిశ్వర్ ముదిరాజ్ తెలిపారు. శనివారం తలకొండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పలు అంశాలపై చర్చించి, గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు.వర్షాల కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వీధిలైట్లు, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిలో కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ఒక సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య పుట్టుకొస్తూనే ఉంటుందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత అధికారుల సహకారం, సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో 6, 7 తేదీల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఉత్సవాలను విజయవంతం చేయడంతో పాటు వర్షాకాలంలో గ్రామ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ సత్యం , వార్డు సభ్యులు పోతుగంటి కుమార్, పద్మ జ్యోతి కిషోర్, ఇటమోని వెంకటేష్ యాదవ్, పెరుమాండ్ల అలివేలు ఆంజనేయులు, కనుక వెంకటయ్య, తిరుమణి అనూష రవి, తుమ్మ నరసింహ, పాలక మండలి తదితరులు పాల్గొన్నారు,