Kaizer News

Maharashtra pilgrims | నేపాల్ వరదల్లో చిక్కుకున్న

Maharashtra pilgrims | నేపాల్ వరదల్లో చిక్కుకున్న వంద మంది మహారాష్ట్ర యాత్రికులు.. రక్షించిన బీహార్‌ ప్రభుత్వం

· National - India · ntnews.com

పాట్నా: నేపాల్‌లో అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా మహారాష్ట్రకు చెందిన వంద మంది యాత్రికులు ఖఠ్మాండూలో చిక్కుకుపోయారు. మహారాష్ట్ర అభ్యర్థన మేరకు బీహార్‌ ప్రభుత్వం స్పందించింది. నేపాల్‌ సరిహద్దు ద్వారా వారిని సురక్షితంగా బీహార్‌కు తరలించింది. ఆ తర్వాత ప్రత్యేక రైలు కోచుల్లో వారి సొంత రాష్ట్రానికి పంపింది. (Maharashtra pilgrims) మహారాష్ట్రకు చెందిన సుమారు వంద మంది యాత్రికులు నేపాల్‌ వెళ్లారు. అక్కడ సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా చిక్కుకుపోయారు. కాగా, తమ వారిని కాపాడాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపై బీహార్‌ ప్రభుత్వం స్పందించింది. బీహార్ సీఎం ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో సీతామర్హి జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది. ఆగస్ట్‌ 28న మహారాష్ట్ర యాత్రికులను నేపాల్‌ సరిహద్దు ద్వారా సీతామర్హికి సురక్షితంగా తరలించింది. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, ఇతర అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర యాత్రికులను సీతామర్హి నుంచి పాట్నాకు తరలించారు. ఆగస్ట్‌ 29న తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు బీహార్‌ రాజధానికి వారు చేరుకున్నారు. పాట్నా జిల్లా యంత్రాంగం వారికి వసతి కల్పించింది. భోజనం, బస ఏర్పాట్లు చేసింది. వైద్య పరీక్షలు, ఇతర అవసరమైన సదుపాయాలు కూడా కల్పించారు. మరోవైపు మహారాష్ట్ర యాత్రికులను రైలులో వారి రాష్ట్రానికి తరలించేందుకు బీహార్‌ ప్రభుత్వం రైల్వే బోర్డును సంప్రదించింది. ఈ నేపథ్యంలో పాట్నా-పూర్ణ ఎక్స్‌ప్రెస్‌కు రెండు అదనపు కోచ్‌లను జత చేశారు. ఆ రైలులో ప్రయాణించిన మహారాష్ట్ర యాత్రికులు సురక్షితంగా తమ రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. బీహార్ ప్రభుత్వంతో పాటు సీతామర్హి, పాట్నా జిల్లాల అధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News