‘నీవు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తా’ అన్నట్లు వ్యవహారం.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై రఘునందన్ రావు ఫైర్ ప్రజా సమస్యలపై చర్చకు అడ్డుపడ్డారని ఆరోపణ.. రెండు పార్టీలు ఒకటేనని విమర్శ BJP MP | హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రెండు పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై స్పందించారు. ‘‘నీవు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు’’ అంటూ విమర్శించారు. రెండు పార్టీల తీరు ఒకేలా ఉందని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌లకు వెళ్లడం అవసరమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగమే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. భూముల రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు మళ్లీ వాటిని పరిశీలించేందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌కు గతంలో జరిగిన ఉప ఎన్నికలు కలిసొచ్చినట్లు ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నిజాం పాలనపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాంను ప్రశంసించడం సరైన విధానం కాదని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, రేవంత్‌రెడ్డిల గత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ.. చరిత్రను వక్రీకరించకూడదని అన్నారు. బైరాన్‌పల్లి ఘటన, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఎంఐఎంకు అనుకూలంగా మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని అన్నారు. ప్రజా సమస్యలు, తెలంగాణ అభివృద్ధి అంశాలపై బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని రఘునందన్ రావు పేర్కొన్నారు