Kaizer News

Auqib Nabi | కౌంటీల్లో భారత పేస్ అస్త్రం.. స్వదేశా

Auqib Nabi | కౌంటీల్లో భారత పేస్ అస్త్రం.. స్వదేశానికి తిరిగి వచ్చేది అప్పుడే..!

· National - India · ntnews.com

Auqib Nabi : రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో భారత జెర్సీ ధరించిన అకీబ్ నబీ (Auqib Nabi) విదేశాల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. టెస్టుల్లో మరింత బౌలింగ్‌ అనుభవం కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన అతడు అక్కడ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ (County Championship)లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. మూడు కౌంటీ మ్యాచుల్లో ఆడనున్న ఈ స్పీడ్‌స్టర్.. సర్రే (Surrey) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అనంతరం.. సెప్టెంబర్‌లో మూడో వారంలో నబీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC 2025-27)లో కీలకమైన న్యూజిలాండ్ పర్యటనలో యువ పేసర్‌ అకీబ్ నబీని అస్త్రంగా ప్రయోగించాలనుకుంటోంది భారత జట్టు. అందుకని.. కివీస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని అతడిని ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడేందుకు పంపింది బీసీసీఐ. టెస్టు బౌలర్‌గా నబీ మరింత రాటుదేలడం కోసం, ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతడి స్వింగ్ నైపుణ్యాన్ని పరీక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో నార్త్ జోన్ స్క్వాడ్‌ నుంచి వైదొలిగిన నబీ.. యూకే వీసాతో ఇంగ్లండ్ చేరుకున్నాడు. అక్కడ సర్రే జట్టు తరఫున మూడు కౌంటీ మ్యాచ్‌లు ఆడనున్నాడీ బారాముల్లా ఎక్స్‌ప్రెస్. సెప్టెంబర్ 2వ తేదీన యార్క్‌షైర్ జట్టును సర్రే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌తో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నబీ అరంగేట్రం చేయనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 8న సస్సెక్స్‌ జట్టుతో, సెప్టెంబర్ 15న గ్లమోర్గాన్‌ జట్టుతో సర్రే తలపడనుంది. ఈ మూడు మ్యాచులు పూర్తయ్యాక పుదుచ్చేరిలో సెప్టెంబర్ 22న ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్‌ కోసం నబీ భారత్‌కు రానున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 43 మ్యాచుల్లోనే 162 వికెట్లు తీసిన ఈ పేస్‌గన్.. రాబోయే రోజుల్లో టీమిండియా బౌలింగ్ దళంలో కీలకం కానున్నాడు

Original source: ntnews.com
Read more on Kaizer News