Kaizer News

లిఫ్ట్, గోడ మధ్య ఇరుక్కున్న వ్యక్తి . . రక్షించిన

లిఫ్ట్, గోడ మధ్య ఇరుక్కున్న వ్యక్తి . . రక్షించిన ఫైర్, హైడ్రా బృందం

· City - Hyderabad · prabhanews.com

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగరంలోని మూసాపేట ఆంజనేయనగర్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌, గోడ మధ్య ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని హైడ్రా, ఫైర్‌ సిబ్బంది సంయుక్తంగా రక్షించారు. స్థానికంగా ఉన్న ఓ భవనంలోని లిఫ్ట్‌లో మురళి(40) అనే వ్యక్తి చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో హైడ్రా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందం వెంటనే అక్కడికి చేరుకుంది. పాత లిఫ్ట్‌ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో రెండో అంతస్తులో బయటకు వస్తున్న సమయంలో లిఫ్ట్‌ ఒక్కసారిగా పైకి కదిలింది. దీంతో మురళి కాలు గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన రెండో, మూడో అంతస్తుల మధ్య లిఫ్ట్‌-గోడ మధ్య వేలాడుతూ ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న హైడ్రా, ఫైర్‌ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ లిఫ్ట్‌ను నియంత్రణలోకి తీసుకుని.. లోపల చిక్కుకున్న మురళిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంటన్నరపాటు కొనసాగిన ఆపరేషన్‌ అనంతరం ఉదయం 10.50 గంటలకు మురళిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.ప్రమాదంలో మురళి కాలికి ఫ్రాక్చర్‌ కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల నగరంలో లిఫ్ట్‌ల సాంకేతిక లోపాల కారణంగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాత లిఫ్ట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. భవన యాజమాన్యాలు లిఫ్ట్‌ల సెన్సార్లు, భద్రతా పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనలో హైడ్రా బృందం వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది

Original source: prabhanews.com
Read more on Kaizer News