Kaizer News

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త పథకం.. వారికి కూడా ఇప్పటినుంచి

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త పథకం.. వారికి కూడా ఇప్పటినుంచి పీఎఫ్ సౌకర్యం.. వెంటనే చేరవచ్చు..

· Business · tv9telugu.com

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరింతమందికి పీఎఫ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026 తాజాగా ప్రారంభించింది. గతంలో అర్హత ఉండి నమోదు కాని ఉద్యోగులు ఈ పథకం ద్వారా ఈపీఎఫ్ఓలో ఇప్పుడు చేరవచ్చు. జులై 1 నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించిన భవిష్య నిధి సంస్థ.. అక్టోబర్ 31వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. గతంలో మిగిలిపోయిన వారు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అయితే డిక్లరేషన్ సమయంలో అదే సంస్థలో పనిచేస్తూ ఉండాలని స్పష్టం చేసింది. మరింతమంది ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్, బీమా వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్‌ 29న EEC-2026ను కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. 2009 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో అర్హత ఉండి నమోదుకాని వారు ఇప్పుడు ఈ పథకం ద్వారా ఈపీఎఫ్ఓలో చేరవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిధితో పాటు ఈపీఎఫ్ఓ చట్టం, సామాజిక భద్రతా కోడ్ కింద కవరేజీకి వచ్చే సంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. కంపెనీలు తమ పాత రికార్డులను పరిశీలించి నమోదు కాని ఉద్యోగులను చేర్చాలని కోరింది. అర్హత ఉండి నమోదు కాకపోతే ఇప్పుడు చేర్పించాలని స్పష్టం చేసింది. నమోదు కాని ఉద్యోగులను సంస్థలన్నీ గుర్తించాలని సూచించింది. అయితే ఆన్‌లైన్ ద్వారా ‘ఎంప్లాయీస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ క్యాంపెయిన్‌ పథకంలో చేరవచ్చు. ఇక ఉమాంగ్ యాప్ ద్వారా ఉద్యోగులు యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈసీఆర్ ద్వారా పీఎఫ్ కాంట్రిబ్యూషన్లను చెల్లించవచ్చు. కొత్తగా చేరే ఉద్యోగులకు పెన్షన్, ఉద్యోగి డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (EDLI) వంటి ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు సంస్థల గత కాంప్లయన్స్‌ లోపాలను క్రమబద్ధీకరించేందుకు ఈ ప్రత్యేక విండో ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద యజమాని తన కాంట్రిబ్యూషన్‌తో పాటు వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించాలి. ఇక ఉద్యోగి వాటా చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. ఒక్కో సంస్థకు నష్టపరిహారానికి బదులు రూ.100 లంప్‌సమ్‌ డ్యామేజెస్‌ నిబంధనను ప్రవేశపెట్టారు. అయితే మరింత మందికి పీఎఫ్ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు చాలామంది ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలకు దూరమయ్యారు. దీంతో ప్రతీఒక్కరిని ఇందులో చేర్చేందుకు నిబంధనలను సడలిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేసేవారికి కూడా పీఎఫ్ ప్రయోజనాలు అందించేందుకు త్వరలో ఒక కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News