Kaizer News

అంతర్జాతీయ అంబాసిడర్లుగా..

అంతర్జాతీయ అంబాసిడర్లుగా..

· National - India · ntnews.com

ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ వీక్‌ అంటే.. ఒకప్పుడు హాలీవుడ్‌ హీరోయిన్లదే రాజ్యం! మన తారలకు ఆహ్వానం అందడమే అదృష్టం! అతిథిగా వెళ్లడం.. ఓ ప్రేక్షకురాలిగా ఫ్యాషన్‌ షోలను వీక్షించి రావడం! అంతే అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత ఫ్యాషన్‌ ప్రపంచాన్ని బాలీవుడ్‌ భామలే ఏలుతున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ముందు వరసలో ఉన్నది. ప్రఖ్యాత లూయిస్‌ విట్టన్‌, కార్టియర్‌ లాంటి గ్లోబల్‌ ఫ్యాషన్‌ దిగ్గజ సంస్థలతోపాటు కతార్‌ ఎయిర్‌వేస్‌కి ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అలియా భట్‌.. ప్రఖ్యాత గూచీ బ్రాండ్‌కు మొట్టమొదటి భారతీయ గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. అంతర్జాతీయ బ్యూటీ ఉత్పత్తుల సంస్థ లోరియల్‌ ప్యారిస్‌కూ ప్రచార కర్తగా కొనసాగుతున్నది. లైగర్‌లో విజయ్‌ దేవరకొండతో జతకట్టింది బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ అనన్యా పాండే. 2025-26 సంవత్సరానికి గాను.. ప్రసిద్ధ ఫ్రెంచ్‌ బ్రాండ్‌ షానెల్‌కు గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఎంపికై సంచలనం సృష్టించింది. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌-హాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా కూడా వీరి బాటలోనే నడుస్తున్నది. ఇటాలియన్‌ జువెల్లరీ బ్రాండ్‌ బుల్గారీతోపాటు స్విస్‌ లగ్జరీ వాచ్‌ల సంస్థ రోలెక్స్‌కు అంతర్జాతీయ ప్రచారకర్తగా పనిచేస్తున్నది. మరోవైపు అమెరికాకు చెందిన లగ్జరీ కాస్మెటిక్స్‌ ఉత్పత్తుల సంస్థ ఎస్టీ లౌడర్‌.. తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా మరో మాజీ ప్రపంచసుందరి, బాలీవుడ్‌ తార మానుషీ చిల్లర్‌ను ఎంచుకుంది. మాడలింగ్‌, ప్రచారంలోనే కాదు.. ఫ్యాషన్‌ ఉత్పత్తుల వ్యాపారాల్లోకి పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. వివిధ రిటైల్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొన్ని లగ్జరీ బ్రాండ్లను కూడా నడిపిస్తున్నారు. ఇక పలువురు భారతీయ మహిళా డిజైనర్లు కూడా అంతర్జాతీయ వేదికలపై తమదైన ముద్ర వేస్తున్నారు. మొత్తానికి, భారతీయ మహిళలు.. లగ్జరీ ప్రపంచంలో కేవలం కొనుగోలుదారులుగానే ఉండిపోవడం లేదు. గ్లోబల్‌ ఐకాన్‌లుగా మారి.. అంతర్జాతీయ లగ్జరీ రంగాన్ని సరికొత్తగా నిర్వచిస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News