Kaizer News

Nepal Floods: ఆ షాకింగ్ వీడియో చైనాలో నిషేధం..

Nepal Floods: ఆ షాకింగ్ వీడియో చైనాలో నిషేధం..

· National - India · ntnews.com

కాట్మాండు : ప్ర‌కృతి విరుచుకుప‌డితే ఎలా ఉంటుందో నేపాల్ వ‌ర‌ద‌లు(Nepal Floods) చాటిచెప్పాయి. ఆ మ‌హావిల‌యం సంభ‌వించిన‌ప్పుడు నేపాల్‌, టిబెట్ బోర్డ‌ర్‌లో ఉన్న గిరాంగ్ పోర్ట్ ఇమ్మిగ్రేష‌న్ సెంట‌ర్ ఆ శ‌క్తివంత‌మైన వ‌ర‌ద‌ల‌కు సాక్ష్యంగా నిలిచింది. అత్యంత బ‌ల‌మైన బండ‌రాళ్లు, బుర‌ద‌, నీరు ఆ సెంట‌ర్‌పై విరుచుకుప‌డింది. ఆ వ‌ర‌ద ధాటికి అక్క‌డ ఉన్న వాహ‌నాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌రుగులు తీసిన జ‌నం ఆ ప్ర‌వాహంలో క‌న్నుమూశారు. కొండ‌ల మ‌ధ్య మ‌హోగ్రంగా బుర‌ద నీరు మ‌హా ప్ర‌ళ‌యం సృష్టించింది. అయితే గిరాంగ్ పోర్ట్ వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు ఆ ప్ర‌కృతి పంజా చిక్కిన విష‌యం తెలిసిందే. ప్ర‌ప‌పంచ దేశాల‌న్నీ ఆ వీడియోను వీక్షించాయి. కానీ డ్రాగ‌న్ దేశం చైనాలో మాత్రం ఆ వీడియోపై నిషేధం ఉన్న‌ది. ఇప్ప‌టికే వ‌ర‌కు ఆ దేశంలో ఈ వీడియోను ప‌బ్లిక్‌గా ప్ర‌ద‌ర్శించ‌లేదు. కేవ‌లం ఒకే ఒక్క స్టిల్ ఫ్రేమ్ షాట్ మాత్ర‌మే చైనా మీడియాలో ప్లే చేస్తున్నారు. అక్క‌డి న్యూస్ బులిటెన్‌లో కూడా ఈ ఫ్రేమ్‌నే రిపీట్ చేస్తున్నారు. క‌ఠిన‌మైన సెన్సార్‌షిప్ ఉన్న చైనా ఇంట‌ర్నెట్‌లో అస‌లు ఆ వీడియో ఆచూకీ లేదు. ఆకస్మిక వ‌ర‌ద‌ల‌కు చెందిన పోస్టుల‌ను అక్క‌డ సోష‌ల్ మీడియాలో నిషేధించారు. వాస్త‌వానికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన కొన్ని గంట‌ల్లో చైనా స‌ర్కారు భారీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు ఆదేశాలు ఇచ్చింది. వ‌ర‌ద విల‌యం చోటుచేసుకున్న త‌ర్వాత అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ప్ర‌త్యేక ఆదేశాలు జారీ చేశారు. చైనా వైపు కూడా భారీగా న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తున్నా.. అక్క‌డ నుంచి మాత్రం ఎటువంటి ఆన‌వాళ్లు క‌నిపించ‌డం లేదు. గ‌త నాలుగు రోజుల నుంచి ప్ర‌పంచం మొత్తం నేపాల్ వర‌ద‌ల‌ను వీక్షిస్తున్న‌ది, కానీ చైనా ఫైర్‌వాల్ మాత్రం ఆ వీడియోల‌కు చెక్ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. నేపాల్ విల‌యం ప‌ట్ల చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. నేపాల్ అధ్య‌క్షుడు రాంచంద్ర పౌడ‌ల్‌తో మాట్లాడారు. వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు చైనా అధ్య‌క్షుడు సంతాపం తెలిపారు. రెండు దేశాల ప్ర‌జ‌లు చేతులు క‌లిపి ఈ విప‌త్తును అధిగ‌మిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా త‌మ ఇండ్ల‌ను పున‌ర్ నిర్మిస్తార‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News