Metro | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భాగ్యనగరంలో మెట్రో ప్రయాణికులకు మరోసారి సాంకేతిక సమస్యలు ఇబ్బందులు కలిగించాయి. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆన్‌లైన్ టికెట్ తీసుకున్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద టికెట్ల స్కానింగ్ సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లేందుకు, బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలుచోట్ల ప్రయాణికులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణానికి ముందే టికెట్ కొనుగోలు చేసినప్పటికీ గేట్ల వద్ద సమస్యలు తలెత్తడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి ఆన్‌లైన్ టికెటింగ్ సేవలను త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు