ఆకస్మిక వరదల ధాటికి నేపాల్ అట్టుడుకిపోయిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, భయంకరమైన వరదలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. నేపాల్ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 669కు చేరింది. ఇంకా గల్లంతైన వేలాదిమంది వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక నేపాల్ లో ప్రకృతి ప్రకోపానికి అక్కడి నగరాలు, గ్రామాలు, ఇళ్లు, భవనాలు అన్నీ కూడా నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ మేరకు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు అదే పనిగా నిర్భాగ్యుల నుంచి దోపిడీ చేస్తున్నారు. వారి నగదు, బంగారాన్ని దోచుకుంటున్న ఘటనలు అధికం అవుతున్నాయి. ఇటీవల ఓ మహిళ మృతదేహం నుంచి ఇద్దరు దుండగులు బంగారు చెవి పోగులను దొంగిలించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. మరోవైపు వరదల కారణంగా త్రిశూలి నదీ తీరానికి కొట్టుకొచ్చిన ఒక సేఫ్ ను (భద్రతా పెట్టెను) పగలగొట్టి, అందులో ఉన్న సుమారు రూ. 92.68 లక్షలను దొంగిలించినట్లు సమాచారం. ఈ ఆరోపణపై పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మచ్చ తెస్తున్నాయి. ఇక నేపాల్ లో వరదలకు ప్రధానంగా గ్లేసియర్స్ (హిమానీనదాలు) కారణమని అంచనా వేస్తున్నారు. ఈ హిమానీనదాలు ఒకే చోట స్థిరంగా ఉండవు.. ఎత్తైన కొండలపై ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మంచు, అధిక బరువు కారణంగా చాలా నెమ్మదిగా కిందికి ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా గ్లోబల్ వార్మింగ్, హిమాలయాల్లో తీవ్ర వాతావరణ మార్పులు వంటివి కూడా భారీ వరదలకు కారణమై ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు