Kaizer News

Tamil Nadu accident | తమిళనాడులో విషాదం.. చిన్నారు

Tamil Nadu accident | తమిళనాడులో విషాదం.. చిన్నారులను ఢీకొట్టిన పాల వ్యాన్‌

· National - India · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారులపైకి ఓ పాల వ్యాన్‌ దూసుకెళ్లిన ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. దిండిగల్‌ జిల్లాలోని వడమదురై సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి అమ్మమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వడమదురై సమీపంలోని కొల్లపట్టి సమతువపురానికి చెందిన అంజమ్మాల్‌ (60) ఆదివారం మధ్యాహ్నం మేకలను మేపేందుకు పుత్తూరు-కనవైమేడు ప్రాంతానికి వెళ్లారు. ఆమెతో పాటు మనవరాళ్లు యోగవర్షిని (11), అనన్య (6), ధనుశ్రీ (3), మనవడు మోషి కిరణ్‌ (6) సహా మొత్తం ఆరుగురు వెళ్లారు. మేకలను రోడ్డు పక్కన మేతకు వదిలిన అనంతరం అంజమ్మాల్‌, చిన్నారులు సమీపంలోని కాంక్రీట్‌ నిర్మాణంపై కూర్చున్నారు. పిల్లలు అక్కడే ఆడుకుంటుండగా.. కొల్లపట్టి నుంచి పుత్తూరు వైపు ఓ పాల వ్యాన్‌ వేగంగా దూసుకొచ్చింది. వ్యాన్‌ అదుపు తప్పి తమ వైపు వస్తుండటాన్ని గమనించిన అంజమ్మాల్‌ వెంటనే పిల్లలను అప్రమత్తం చేశారు. ఇద్దరు బాలికలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మిగిలిన చిన్నారులను కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లేందుకు అంజమ్మాల్‌ ప్రయత్నించారు. అయితే.. ఆమె ప్రయత్నం ఫలించకముందే వ్యాన్‌ పిల్లలను ఢీకొట్టింది. అనంతరం వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదంలో చిన్నారులతో పాటు అంజమ్మాల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రెండు అంబులెన్సుల్లో దిండిగల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే యోగవర్షిని, అనన్య, ధనుశ్రీ, మోషి కిరణ్‌ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అంజమ్మాల్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పాల వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. కురుందంపట్టికి చెందిన శరవణన్‌ (29) తన గ్రామం సమీపంలో వాహనాన్ని నిలిపి వడమదురై పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంజమ్మాల్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన నలుగురు చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున , తీవ్రంగా గాయపడిన అంజమ్మాల్‌కు రూ.1 లక్ష చొప్పున ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News