హైదరాబాద్, ఆంధ్రప్రభ: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆనంద్‌ను అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ శనివారం వీడియో ప్రకటన విడుదల చేశారు. ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నామని, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. అలాగే హోంగార్డును సర్వీసు నుంచి తొలగించినట్లు వెల్లడించారు. మహిళలపై హింసను సహించం: సీపీ మహిళలపై హింస, నేరాలను తెలంగాణ పోలీసులు ఏమాత్రం సహించబోరని సీపీ రమేశ్ స్పష్టం చేశారు. మహిళలపై నేరాల విషయంలో పోలీస్ శాఖ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కూడా స్పందించారు. పోలీసు సిబ్బంది ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఏ స్థాయి అధికారి అయినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించబోమని పేర్కొన్నారు. హోంగార్డు రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడని విచారణలో తేలిందని డీజీపీ తెలిపారు. అతడిని సర్వీసు నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వెలుపల ఓ హోంగార్డు మహిళపై దాడి చేసి, అనంతరం ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సౌత్ సెంట్రల్ రైల్వే కూడా విచారణ చేపట్టింది. మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హోంగార్డు అని, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో విధుల కోసం డిప్యూటేషన్‌పై వచ్చాడని గుర్తించినట్లు తెలిపింది. అనంతరం అతడిని తెలంగాణ పోలీస్ శాఖకు తిరిగి పంపించి, శాఖాపరమైన చర్యలకు మార్గం సుగమం చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది