Kaizer News

యూపీఐకి కొత్త ఛార్జ్.. క్యాష్‌ వైపు వ్యాపారులు?

యూపీఐకి కొత్త ఛార్జ్.. క్యాష్‌ వైపు వ్యాపారులు?

· Business · prabhanews.com

రూ.2 వేల పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వ్యాపార వర్గాల్లో ఆందోళన.. హైదరాబాద్‌లోనూ ‘నో యూపీఐ.. ఓన్లీ క్యాష్‌’ బోర్డులపై చర్చ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యూపీఐ చెల్లింపులపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)పై వ్యాపార వర్గాల్లో చర్చ మొదలైంది. అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కు మించిన నిర్దిష్ట వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) జరిగే యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తించనుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎండీఆర్‌ గరిష్ఠంగా రూ.300గా ఉంటుంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదని, రూ.2,000 వరకు వ్యాపార చెల్లింపులు కూడా ఉచితంగానే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులకు కూడా నిర్దిష్ట పరిమితి వరకు జీరో ఎండీఆర్‌ కొనసాగనుంది. మొత్తం వ్యాపార యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం ఈ కొత్త ఎండీఆర్‌ పరిధిలోకి రావని కేంద్రం తెలిపింది. అయితే పెద్ద రిటైల్‌ దుకాణాలు, ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌, ఈ-కామర్స్‌ తదితర వ్యాపారాల్లో అధిక విలువైన యూపీఐ చెల్లింపులపై అదనపు వ్యయభారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు అధిక విలువైన యూపీఐ చెల్లింపులను స్వీకరించకుండా నగదు చెల్లింపుల వైపు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అక్కడి వ్యాపారసముదాయాల్లో నో యూపీఐ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎండీఆర్‌ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు కేంద్రం సూచించినప్పటికీ, వ్యాపార సంస్థలు తమ నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని నగదు చెల్లింపులను ప్రోత్సహించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పెద్ద షాపింగ్‌ కాంప్లెక్సులు, రిటైల్‌ సంస్థల్లోనూ అధిక మొత్తాల యూపీఐ చెల్లింపులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది

Original source: prabhanews.com
Read more on Kaizer News