గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చిలుపూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జఫర్‌గఢ్ మండలం తిడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుబాటులో ఉంచిన అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరికరాలను వైద్య బృందంతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఏయే రకాల క్యాన్సర్లను ఈ పరికరాల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. ముందస్తు పరీక్షలతో మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వారికి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనశైలి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం, వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించలేకపోవడం వల్ల చాలామంది పేదలు క్యాన్సర్ బారిన పడి అకాల మరణం చెందుతున్నారని అన్నారు. ఇలాంటి విషాదాలను నివారించాలంటే ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించేందుకు వైద్య శిబిరాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే అత్యాధునిక సదుపాయాలతో తిడుగు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ వైద్య సేవలను ఒక్క గ్రామానికే పరిమితం చేయకుండా నియోజకవర్గం అంతటా విస్తరించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో త్వరలో భారీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందాన్ని ఎమ్మెల్యే కోరారు. అవసరమైతే తానే స్వయంగా హైదరాబాద్ వెళ్లి కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. హనుమకొండలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయని, ఈ ఆసుపత్రులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిడుగు గ్రామంలో ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడానికి విశేష కృషి చేసిన గ్రామ సర్పంచ్ సోమయ్యకు, గ్రామీణ ప్రాంతానికి వచ్చి నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందానికి, యాజమాన్యానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోమయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు