Shorts PF: ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ (PF) కోసం కొంత మొత్తం మినహాయిస్తారు. ఈ వివరాలు సాధారణంగా సాలరీ స్లిప్‌లో కనిపిస్తాయి. అయితే జీతంలో డబ్బు కట్ అయిందని మాత్రమే సరిపోదు. ఆ మొత్తం నిజంగా మీ EPFO ఖాతాలో జమ అయిందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇందుకోసం ఇంటి నుంచే PF పాస్‌బుక్‌ను పరిశీలించవచ్చు. మీ PF ఖాతాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే కంపెనీ సక్రమంగా డబ్బులు జమ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. పాస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడు ముందుగా గత నెలకు సంబంధించిన ఎంట్రీని చూడాలి. ఉదాహరణకు సెప్టెంబర్‌లో చెక్ చేస్తే ఆగస్టు నెల జమ వివరాలను పరిశీలించాలి. పాస్‌బుక్‌లో సాధారణంగా ఉద్యోగి వాటా, కంపెనీ వాటా, పెన్షన్ ఫండ్‌కు వెళ్లిన మొత్తం వంటి వివరాలు కనిపిస్తాయి. వీటిని మీ సాలరీ స్లిప్‌లో ఉన్న PF కట్ అయిన మొత్తంతో సరిపోల్చుకోవచ్చు. మీ PF వివరాలను ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు. ఇందుకోసం EPFO అధికారిక పోర్టల్‌లో మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం సంబంధిత Member IDని ఎంచుకుని PF ఖాతాలోని జమలు, బ్యాలెన్స్ వంటి వివరాలను పరిశీలించవచ్చు. EPFO అందించే ‘Passbook Lite’ సదుపాయం ద్వారా కూడా ఖాతాలో జమ అయిన మొత్తం, విత్‌డ్రా చేసిన డబ్బు, ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ద్వారా PF వివరాలు చెక్ చేయాలనుకునేవారు UMANG యాప్‌ను ఉపయోగించవచ్చు. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత EPFO సేవల్లోకి వెళ్లి ఈ-పాస్‌బుక్‌ను చూడొచ్చు. దీంతో మీ ఖాతాలో ఎప్పుడు ఎంత మొత్తం జమ అయిందో తెలుసుకోవడం సులభమవుతుంది. గతంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసిన వారికి ఒకే UANకు పలు Member IDలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాస్‌బుక్ చూసేటప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన Member IDని సరిగ్గా ఎంచుకోవాలి. జీతంలో PF కట్ అయినా పాస్‌బుక్‌లో వెంటనే ఎంట్రీ కనిపించకపోతే ముందుగా కొంత సమయం వేచి చూడాలి. కొన్నిసార్లు చెల్లింపు, ప్రాసెసింగ్ కారణంగా ఖాతాలో వివరాలు అప్‌డేట్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినా ఎంట్రీ కనిపించకపోతే సాలరీ స్లిప్‌ను తీసుకుని కంపెనీ HR లేదా ఫైనాన్స్ విభాగాన్ని సంప్రదించాలి. PF చెల్లింపు స్థితి, సంబంధిత చలాన్ వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. కంపెనీ నుంచి సరైన సమాధానం రాకపోతే EPFO ఫిర్యాదు వ్యవస్థ EPFiGMS ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు. 2015లో జర్నలిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంతరం 2016 నుంచి పలు మీడియా సంస్థల్లో పనిచేశాను. మొదట ప్రింట్ ఆ తర్వాత డిజిటల్‌లో కలిపి మొత్తం 10 ఏళ్ల అనుభవం ఉంది. నేను ఎక్కువగా లైఫ్‌స్టైల్, అంతర్జాతీయం, టెక్నాలజీ, బిజినెస్, ఆస్ట్రాలజీకి సంబంధించి వార్తలు రాస్తుంటాను