నాంపల్లి, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మేస్త్రీలు, అడ్డ కూలీలు, ఇతర కార్మికులు కార్మిక కార్డులు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ మండల అధ్యక్షుడు రేవెల్లి యాదయ్య తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన పనులు బంద్ చేసి సమావేశాలు నిర్వహించుకోవాలని కార్మికులకు సూచించారు. సంఘ నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా ఆ రోజు పనులకు వెళ్తే జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌లో రసీదు వచ్చినప్పటికీ చాలామంది కార్మికులకు ఇప్పటికీ కార్డులు అందలేదని, దీంతో వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన కార్మికులందరికీ కార్మిక కార్డులు మంజూరు చేయాలని రేవెల్లి యాదయ్య కోరారు. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా రుణాలుగా అందించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించాలని కోరారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు